మతాంతర వివాహమంటూ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అడ్డుకున్న బజరంగ్‌ దళ్‌

మతాంతర వివాహమంటూ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అడ్డుకున్న బజరంగ్‌ దళ్‌

ఆగ్రా : మతాంతర వివాహం చేసుకున్నారని భజరంగ్‌ దళ్‌ సభ్యులు నిరసనలు చేశారు. దీంతో ఆ దంపతులు వారి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుఎస్‌కు చెందిన ఓ మల్టీనేషనల్‌ సంస్థలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అషార్‌ చౌదరి (30), ఎంబిఎ చదివి, ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోన్న అవానీ (29)… నాలుగు నెలల క్రితం అమెరికాలో వివాహం చేసుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌లో ప్రత్యేక వివాహ చట్టం కింద వారి వివాహాన్ని నమోదు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం అలీఘర్‌కు వచ్చిన వీరిద్దరూ… ఇరు కుటుంబ సభ్యులు వారి బంధుమిత్రుల కోసం రిసెప్షన్‌కు ప్లాన్‌ చేశారు. వీరి రిసెప్షన్‌ వేడుక డిసెంబర్‌ 21న జి.టి రోడోలో కళ్యాణమండపంలో జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో వీరి వివాహం మత సామరస్యానికి విఘాతం కలిగిస్తుందంటూ బజరంగ్‌ దళ్‌, కర్ణిసేన, బ్రాహ్మణ మహా సభ్యులు రోడ్లపై నిరసనలు చేశారు. ఈ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. శుక్రవారం కలెక్టరేట్‌ వరకు పాదయాత్రగా వెళ్లి ఎడిఎం (సిటీ) అమిత్‌కుమార్‌ భట్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఒకవేళ ఈ రిసెప్షన్‌ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లా యంత్రాంగాన్ని, రిసెప్షన్‌ హాల్‌ యజమానిని బెదిరించారు. ఈ సంఘటనపై బజరంగ్‌ దళ్‌ కోఆర్డినేటర్‌ గౌరవ్‌ శర్మ మాట్లాడుతూ.. ‘పెద్దల ఇష్టానుసారంగా వివాహం చేసుకోవడానికి రాజ్యాంగం అనుమతిస్తున్నప్పటికీ అలీఘర్‌ వంటి సున్నితమైన నగరంలో అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అశాంతిని రేకెత్తిస్తుంది. మేము ఈ వివాహానికి వ్యతిరేకం కాదు. కానీ ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగకూడదు’ అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు లవ్‌జిహాద్‌కి చెందినదని స్పష్టంగా తెలుస్తుంది. దీనిపై తాము వెనక్కి వెళ్లము అని ఆల్‌ ఇండియా కర్ణి సేన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఠాకూర్‌ జ్ఞానేంద్ర సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

కాగా, హిందూత్వ గ్రూపు సభ్యుల నిరసనలతో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను రద్దు చేసుకున్నామని నూతన దంపతుల ఇరు కుటుంబాలు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. అయితే బజరంగ్‌ దళ్‌ సభ్యుల నిరసనల వల్ల, అతిథుల భద్రత కారణల రీత్యా ప్రస్తుతానికి రిసెప్షన్‌ వాయిదా వేసుకున్నప్పటికీ.. మరికొన్నిరోజుల్లో రిసెప్షన్‌ జరుగుతుందని, దానికి తగ్గట్టుగా మ్యారేజ్‌ హాల్‌ని బుక్‌ చేశామని వారి కుటుంబ సన్నిహితుల్లో ఒకరు మీడియాకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos