ముంబై: ఊహించని విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ భాజపాకు ప్రభుత్వం ఏర్పాటులో మద్ధతివ్వటం దారుణమని శివసేన కీలక నేత సంజయ్ రౌత్ శనివారం మండి పడ్డారు. ‘అజిత్ పవార్ శివసేనకే కాకుండా, యావత్ మహారాష్ట్రకు వెన్నుపోటు పొడిచారు. ఆయన్ను ఛత్రపతి శివాజీ, మహారాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు. నిన్న రాత్రి 9 గంటల వరకు అజిత్ పవార్ మా పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత మాయమయ్యారు. ఇందులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తప్పిందం ఏమీ లేదు. శరద్ పవార్ నూ అజిత్ పవార్ మోసం చేశార’న్నారు. తమ అధినేత ఉద్ధవ్ థాకరేతో శరద్ పవార్ నిరంతరం సంప్రదింపుల్ని చేస్తూనే ఉన్నరన్నారు. శనివారం వీరిద్దరూ భేటీ అయిన తర్వాత విలేఖరులతో మాట్లాడతారని చెప్పారు.