ముంబై : రాజ్యాధికారం కోసం మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు పెద్ద నగరాలకు విస్తరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని, శ్రీలంక, ఉక్రెయిన్ కన్నా ఎక్కువగా నష్టపోతుందని శివసేన పాలక భాజపాను హెచ్చరించింది. శివసేన నేత సంజయ్ రౌత్ మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మన దేశంలోని పెద్ద నగరాల్లో ఘర్షణలు కొనసాగితే, శ్రీలంక, ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న సవాళ్ళ కన్నా తీవ్రమైన సవాళ్ళను మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుంది. ఢిల్లీలో హనుమజ్జయంతి సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం ఉంది. దేశంలోని పెద్ద నగరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటం, అటువంటి పరిస్థితులను సృష్టించడం చాలా దురదృష్టకరం. దేశ రాజధాని నగరంలో అల్లర్లు జరుగుతున్నాయి. ఢిల్లీని కేంద్రం పరిపాలిస్తోంది. ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి. ఇదంతా కేవలం ఈ ఎన్నికల్లో గెలవడం కోసమే. వారికి మరొక సమస్య ఏదీ లేదు. ముంబైలో వారికి అధికారం లేనందునే లౌడ్స్పీకర్ల అంశాన్ని లేవనెత్తారు. అదేవిధంగా ఇతర పెద్ద నగరాలు కూడా ప్రభావితమవుతున్నాయి. దీనివల్ల పని చేసుకోవడానికి బయటకు వెళ్ళే ప్రజలకు ఇబ్బంది. ఇదే పద్ధతి కొనసాగితే, భారత దేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక, ఉక్రెయిన్ కన్నా ఎక్కువగా దెబ్బతింటుంద’ని హెచ్చరించారు.