మౌంట్ మాంగనుయ్: స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా కివీస్ పర్యటన నుంచి వైదొలిగాడని తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆ జట్టుతో జరిగిన చివరి టీ20లో రోహిత్(60*) బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అద్భుతంగా ఆడి పరుగుల వేటలో దూసుకెళ్తుండగా అతడి కాలి కండరాలు పట్టేశాయి. నొప్పి భరించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. తర్వాత మైదానంలోకి అడుగుపెట్టలేదు. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్‌తో పాటు తర్వాత రెండు టెస్టుల సిరీస్‌కు సైతం రోహిత్ దూరమయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయవచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. ‘న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ నిష్క్రమించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి అంతగా బాగోలేదు. జట్టు ఫిజియో అతడి పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది. అయితే, తదుపరి పర్యటనలో మాత్రం రోహిత్ కొనసాగడు’ అని ఓ బీసీసీఐ అధికారి సోమవారం వెల్లడించారు.