సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజకో కొత్త విషయం వెలుగు చూస్తోంది.డిప్రెషన్‌కు గురయ్యారంటూ వస్తున్న ఆరోపణలు ఆయన వ్యక్తిగత సిబ్బంది కొట్టిపడేస్తున్నారు. సుశాంత్ ముఖంలో ఎప్పుడు అలాంటి ఛాయలు కనిపించలేదని మాజీ డ్రైవర్ అనిల్ ఆదివాసీ స్పష్టం చేశారు. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలను బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే డిప్రెషన్ థియరీలను తెరపైకి తెస్తున్నారని పేర్కొన్నారు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోకి రియా చక్రవర్తి ప్రవేశించిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పటి వరకు సుశాంత్ నియమించుకొన్న ప్రతీ ఒక్కరిని రియా చక్రవర్తి తొలగించింది. ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండీ టీమ్ మొత్తాన్ని బయటకు పంపించింది. అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో సుశాంత్, రియా మధ్య రిలేషన్‌షిప్ లేదనుకొంటాను అని అనిల్ పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలో భారీగా ఆశయాలను, లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. చంద్రమండలం పైకి యాత్ర చేయాలనే కల కనేవాడు. ఇలాంటి విషయాలు పక్కవారు విని జీర్ణించుకొలేకపోయేవారు. ఆయన చుట్టు ఉన్నవారు చాలా మిస్టరీగా వ్యవహరించే వారు. తన సిబ్బందిని బాగా చూసుకొనే వారు అని అనిల్ ఆదివాస్ వెల్లడించారు.సుశాంత్‌తో కలిసి ఓ రోజు షూటింగ్ వెళ్లాను. ఆ రోజు ఆలస్యం కావడంతో నేను కారులో నిద్రమత్తులో జోగుతున్నాను. అప్పుడు నా వద్దకు వచ్చి నిద్ర వస్తుందా అంటే లేదు అని చెప్పాను. ఆయన నా పరిస్థితిని గ్రహించి పర్వాలేదు.. నీవు డ్రైవింగ్ చేయవద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఆయనే డ్రైవ్ చేసుకొంటూ వెళ్లాడు. నేను మరో కారులో వచ్చాను అని ఓ సంఘటనను అనిల్ ఆదివాసి గుర్తు చేసుకొన్నారు.సుశాంత్ సింగ్‌కు మరణం అంటే చాలా భయం. జీవితమంటే ఆయను పంచ ప్రాణాలు. అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకొన్నారని నేను అనుకొను. సుశాంత్ అలాంటి పని చేశాడని నేను నమ్మను. సుశాంత్ మంచి హృదయం ఉన్న మనిషి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం పంచుతుండేవారు అని అనిల్ ఆదివాసీ తెలిపారు.