దశాబ్దాలుగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న కశ్మీర్ అంశంపై జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించి అమెరికా చివరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.కశ్మీర్ అంశంపై ఇరు దేశాల ద్వైపాక్షిక సమస్యని ఈ అంశంలో తాము కేవలం సహకారం మాత్రమే అందిస్తామంటూ స్పష్టం చేసింది.కశ్మీర్ అంశానికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందుకు కారణంగా తెలుస్తోంది.అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సోమవారం సమావేశమైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా తమతో చర్చించారంటూ వ్యాఖ్యానించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం మండిపడింది.కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని తేల్చిచెప్పింది.కశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పదించడంతో అమెరికా వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని చెప్పింది. ఈ సమస్యను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే అమెరికా సాయం అందిస్తుందని స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పాక్ తీసుకునే చర్యల ఆధారంగానే ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారని, ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ సమాజం సైతం ఆ దేశంపై ఆంక్షలు విధించిందని చెప్పారు. భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్ఫష్టం చేశారు..