హైదరాబాద్ : కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడుల విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఐటీ దాడులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడబోరని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అంతా అండగా ఉంటుందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకులను ఐటీ టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తోందన్నారు. గత వారం రోజుల నుంచి కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.