ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్కు కూడా ముప్పుగా పరిణమించిందని వినిపిస్తున్న వార్తలు గుబులుపుట్టిస్తున్నాయి. చైనా నుంచి ఇండియాకు వచ్చిన వారితో వ్యాధి సంక్రమిస్తోందని అంటున్నారు. భారత ప్రభుత్వం సైతం ముందు జాగ్రత్త చర్యలకు ఉప క్రమించింది. వ్యాధి నివారణా చర్యల పై అవగాహన కల్పిస్తోంది.చైనాలోని వివిధ ప్రాంతాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారత విద్యార్థులపై ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది.ఇప్పటికిప్పుడు ఎవరూ ఇండియాకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చాకే విద్యార్థులు ఇండియా వెళ్లేందుకు అనుమతినిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వెళ్లకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.కాగా, చైనా తాజా నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా, భారత అధికారులు భరోసా ఇస్తున్నారు. చైనాలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కొందరు వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ లోనూ ఉన్నారు. వీరంతా కరోనా వైరస్ తగ్గిన తరువాతనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది.అయితే తాజాగా చైనాలోని వుహాన్ లో హుబి యూనివర్సిటీలో చిక్కుకున్న భారత విద్యార్థులను పంపించడానికి చైనా అంగీకరించింది. మమ్మల్ని స్వదేశానికి తీసుకు పోండి అన్న భారతీయ విద్యార్థుల విన్నపం మేరకు ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానాన్ని భారత ప్రభుత్వం అక్కడికి పంపించింది. వైద్య పరీక్షలు చేసి వారికి వ్యాధి సోకిందో లేదో నిర్ధారించనున్నారు.