పాట్నా: మహిళా రిజర్వేషన్ చట్టంపై ఆర్జేడీ సీనియర్ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు అబ్దుల్ బారీ సిద్ధిఖి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ చట్టంతో కేవలం లిప్ స్టిక్ వేసుకున్న మహిళలకే ప్రయోజనమని అన్నారు. చట్టంలో ఓబీసీ మహిళలకు కోటా లేకపోవడంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వెనకబడిన వర్గాల మహిళలకు చట్టంలో తగిన కోటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. మిత్ర పక్షాల నేతలు కూడా అబ్దుల్ బారీ సిద్ధిఖీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్జేడీ అధికార ప్రతినిధి అజాజ్ అహ్మద్ సిద్ధిఖి మాత్రం అబ్దుల్ బారీ సిద్ధిఖీని సమర్థించారు. వెనకబడిన వర్గాల మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించకపోతే మహిళా రిజర్వేషన్ చట్టంతో న్యాయం జరగదని అజాజ్ అహ్మద్ విమర్శించారు. అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని అజాజ్ అహ్మద్ సిద్ధిఖి ఆరోపించారు.