
అమరావతి:తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పారితోషికాన్ని బాగా పెంచడంతో జన సేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ తెగ రెచ్చిపోతున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి శనివారం ట్విటర్లో ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఏప్రిల్ 11 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించక తప్పదని మండి పడ్డారు. ‘పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ తెగ రెచ్చి పోయారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడు తున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.’ అని ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరి కోసం పని చేస్తున్నారో? తెదేపాను వెనకేసుకొచ్చి ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో? రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. ఆయనకు ఇల్లు కట్టిచ్చింది హెలికాప్టర్లు సమకూర్చింది ఎవరో? తెలియనంత అమాయకులేం కాదు ప్రజలు. చివరకు జనసేన అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది కూడా చంద్ర బాబే కాదా? అని ప్రశ్నించారు. ‘ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్..? కిందటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలతాయని నిలబడలేదన్నారు. ఈ సారి మీ యజమాని చెప్పినట్లు పోటీ చేసి ఓట్లు చీల్చాలను కుంటున్నారు. ఒక సారి నమ్మించగలరేమో. కానీ ప్రతి సారీ మీ ప్యాకేజీ కుప్పి గంతులను అర్థం చేసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు.’ అని వ్యాఖ్యానించారు.