న్యూఢిల్లీ : వారణాసి లోక్‌సభ నియోజక వర్గం నుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోటీకి దిగిన సమాజవాది పార్టీ అభ్యర్థి బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ యాదవ్ దాఖలు చేసిన నామ పత్రాన్ని తిరస్కరించటానికి గల కారణాల్ని గురువారం లోగా వివరించాలని అత్యున్నత న్యాయ స్థానం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్వతంత్ర అభ్యర్ధిగా, ఎస్పీ అభ్యర్ధిగా దాఖలు చేసిన రెండు నామ పత్రాల్ని ఎన్నికల అధికార్లు తిరస్కరించడాన్నియాదవ్ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. తన రెండు నామ పత్రాల్లో వ్యత్యాసాల గురించి తాను సకాలంలో వివరణ ఇచ్చినా,ఆధారాల్ని సమర్పించినా ఎన్నికల అధికార్లు బుద్ధి పూర్వకంగానే తిరస్కరించారని ఆరోపించారు. రెండు నామ పత్రాల్లో తాను ఉద్యోగం నుంచి వైదొలిగేందుకు గల కారణాల్ని పరస్పర వైరుధ్యంగా పొందుపరిచినందున వాటిని తిరస్కరించినట్లు ఎన్నికల సంఘం అధికార్లు వివరించారు. మోదీపై ఎస్పీ, బీఎస్పీ, ఆర్జెడిలీ కూటమి అభ్యర్ధిగా తేజ్ ప్రతాప్ యాదవ్‌ను విపక్షాలు వారణాసి బరిలోకి దింపారు.