బెంగుళూరు:. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన కేసులో శుక్రవారం పోలీసులు ఆర్సీబీ ఉద్యోగి నిఖిల్ సోసేల్‌ను అరెస్టు చేశారు. ముంబై వెళ్తున్న అతన్ని కెంపగౌడ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటకు కారణమైన ఆర్సీబీ ప్రతినిధులను అరెస్టు చేయాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న సోసేల్‌తో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్టు చేశారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం గత రెండేళ్ల నుంచి ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్‌గా ఉన్నాడు. డియాగో ఇండియా కంపెనీలో ఉద్యోగి. ఆర్సీబీ ఓనర్స్ యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్‌ను డియాగో ఇండియా ఆపరేట్ చేస్తున్నది.విజయ్ మాల్యా తప్పుకోవడంతో ఆర్సీబీకి ఫుల్ టైం ఓనర్లుగా యూఎస్ఎల్ మారింది. ఆర్సీబీ బ్రాండ్ డిజైన్, స్ట్రాటజీ వెనుక నిఖేల్ సోసేల్ ఇంచార్జీగా వ్యవహరించారు. ఐపీఎల్‌లో ఆర్సీబీ పాపులర్ టీమ్‌గా ఉన్న విషయం తెలిసిందే. డియాగో కంపెనీలో 13 ఏళ్లుగా బెంగుళూరు నుంచి నిఖిల్ పనిచేస్తున్నాడు. ఆర్సీబీ ఫ్రాంచైజీతో అతను క్లోజ్‌గా పనిచేశాడు. ఆర్సీబీ బిజినెస్ పార్ట్నర్‌షిప్ హెడ్‌గా చేశాడు. డీసీపీ అక్షయ్ నేతృత్వంలోని క్రైం బ్రాంచ్ పోలీసులు ఆర్సీబీ టీంను అరెస్టు చేశారు. నిందితుల్ని సీఐడీకి అప్పగించనున్నారు.