బాలికపై అఘాయిత్యం – 13 మందిపై కేసు

బాలికపై అఘాయిత్యం – 13 మందిపై కేసు

శ్రీసత్యసాయి జిల్లా: రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత బాలికపై పలువురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బాలిక 8వ తరగతి చదువుతోంది. ప్రేమిస్తున్నానంటూ గ్రామానికి చెందిన అభిషేక్‌ అనే యువకుడు వెంటపడి ఆమెను నమ్మించి, అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకూ చెప్పాడు.  అభిషేక్‌కు సన్నిహితుడైన మరో యువకుడు బాలికపై అత్యాచారం చేయడమేకాక ఆ దురాగతాన్ని మరో యువకుడితో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. గ్రామంలో మరికొందరికి ఈ వీడియో వాట్సప్‌లో పంపారు.స్కూల్​కు చదువుకునేందుకు వెళుతున్న ఆ బాలికపై కన్నేసిన 13 మంది యువకులు సెల్‌ఫోన్‌లో ఆ వీడియో చూపించి బెదిరిస్తూ కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. జరిగిన విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధం కావడంతో యువకుల తరఫున కొంతమంది పెద్దమనుషుల అవతారం ఎత్తి పంచాయితీ చేశారు. కేసు నమోదు కాకుండా బాలికతోపాటు తల్లిదండ్రులను యువకులు, పెద్ద మనుషులు గురువారం దగ్గరలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలుస్తోంది.ఈ విషయం అంతా వెలుగులోకి రావడం, గ్రామంలో బాలిక కుటుంబం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. ధర్మవరం డీఎస్పీ హేమంత్‌ కుమార్, రామగిరి సీఐ శ్రీధర్‌ ఈ ఘటనపై విచారణ చేపట్టి, గాలింపు నిర్వహించి శుక్రవారం బాలిక కుటుంబ సభ్యులను గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి ఏడుగురు యువకుల్ని పట్టుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం డీఎస్పీ ఆఫీస్​కి ఎస్పీ వి. రత్న చేరుకొని బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురు యువకులను డీఎస్పీ హేమంత్‌కుమార్‌ విచారించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos