బెంగళూరు:కాంగ్రెస్ పార్టీ విధాన సభ సభ్యుడు ఉమేశ్ జాదవ్( చించోళి) సోమవారం సమర్పించిన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలో వద్దో రెండు రోజుల తర్వాత తీర్మానిస్తామని విధాన సభాపతి రమేశ్ కుమార్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ఇక్కడ తన నివాసం వద్ద ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఉమేశ్ జాదవ్ ఇంటికి వచ్చి విధానసభ సభ్యత్వ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. స్వీకరించాను. దీనికి సంబంధించి న్యాయ కోవిదుల అభిప్రాయాల్ని తెలుసుకుని, రెండు రోజుల తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటాను’ అని విశదీకరించారు. ‘ కాంగ్రెస్ శాసన సభా పక్ష ఆదేశాన్ని ఉల్లంఘించి, విధానసభ సమావేశాలకు గైరు హాజరైనందుకు ఉమేశ్ జాదవ్‌తో బాటు మొత్తం నలుగురు కాంగ్రెస్ విధానసభ సభ్యుల్ని రాజకీయ పక్షాల ఫిరాయింపు నిషేధ చట్టం కింద ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యల్ని తీసుకోవాలని విధాన సభాపతికి ఫిర్యాదు చేసాం. దీనిపై ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. ఇదే తరహా వ్యాజ్యం ఒకటి అత్యున్నత న్యాయస్థానం విచారణలో ఉంది. ’అని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత , మాజీ ముఖ్య మంత్రి సిద్ధ రామయ్య మాధ్యమ ప్రతినిధులతో అన్నారు. తాము సమర్పించిన ఫిర్యాదుపైనే తొలుత సభాపతి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. తదుపరి ఇతర విషయాలని వ్యాఖ్యానించారు.