తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు నియామకాన్ని సవాల్ చేస్తూ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు మంగళ వారం హైకోర్టు లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం, తితిదే, రమణ దీక్షితులకు తాఖీదుల్ని జారీ చేసింది. తితిదే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు గత ఏప్రిల్ 4న బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన అర్చకులుగా ప్రస్తుతం గొల్లపల్లి వంశానికి చెందిన వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. ఆయన శాశ్వత ఉద్యోగి. రమణ దీక్షితులు ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించినా కూడ అధికార బదలా యింపులు ఉండవని అధికారులు ప్రకటించారు. మూడేళ్ల కిందట నివృతరయిన అర్చకులు తిరిగి విధుల్లో చేరవచ్చని తితిదే పాలక మండలి నిర్ణయించింది. 65 ఏళ్లు దాటిన అర్చకులను నివృతి చేయాలని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. శ్రీవారి,గోవిందరాజస్వామి, పద్మావతి అమ్మవారి ఆల యంలో 65ఏళ్లు నిండిన అర్చకులందరూ నివృతి అయ్యారు. దరిమిలా రమణ దీక్షితులతో పాటు మూడు ఆలయాల పది మంది మిరాశీ వంశీకులు, నాన్మిరాశీ (కైంకర్యపరులు) అర్చకులు, మరో 10 మంది విధుల నుంచి తప్పు కున్నారు. వీరి స్థానంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వేణుగోపాల దీక్షితులు, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులను నియమించారు.