న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం వేగంగా విచారణలు సాగించరాదని సున్ని వక్ఫ్ బోర్డు వ్యక్తం చేసిన ఆక్షేపణను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తోసి పుచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వారంలో ఐదు రోజుల పాటు విచారణ జరుగుతుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. సోమ వారం, శుక్ర వారం కూడా విచారణ జరపటాన్ని వక్ఫ్ మండలి తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ ఆక్షేపించారు. ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ఐదు గురు సభ్యుల ధర్మాసనం ఆ వాదనల్ని తోసిపుచ్చింది. ‘మీరు (ధవన్) విరామాన్నితీసుకోదలిస్తే తిరిగి ఎప్పుడు వాదనలు చేస్తారో తెలపండ’ని చెప్పారు.తొలుత ధావన్ తన వాదనల్లో వారంలో ఐదు రోజుల వాదనలు ‘అమాన వీయ’మని వ్యాఖ్యానించారు. ఇదే విధానం కొనసాగితే తాను వాదించజాలననన్నారు. ఇది మొదటి అపీల్ కాబట్టి దీనిపై ఆతృత ప్రదర్శించరాదని చెప్పారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. ‘మీ ఇబ్బందులు విన్నాం. మీ విన్నపాన్ని పరిశీలించి, ధర్మాసనం నిర్ణయాన్ని చెబుతాం’ అని అన్నారు. ఈ నెల 6న ప్రారంభమైన విచారణ నాలుగో రోజయిన శుక్రవారం కూడా కొనసాగింది.