దిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని వీహెచ్‌పీ(విశ్వ హిందు పరిషత్) చేస్తున్న ఆందోళనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వచ్చే నాలుగు నెలలు ఎలాంటి నిరసనలు చేపట్టబోమని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్ తెలిపారు. ‘‘ ఈ సమయంలో ఒకవేళ మేము ఆందోళనలను కొనసాగిస్తే ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ఇవి చేస్తున్నామని వారు అనుకునే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఓ పార్టీకి వంత పాడుతున్నామనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నిరసనలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఆయన అన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు ముగియగానే రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.