ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల 9వ రోజు ప్రారంభమైయ్యాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో దొరికిన నగదు వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన నివాసం నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రేణుకా చౌదరి సోమవారం పార్లమెంటులో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం వివరణ, హామీ ఇవ్వాలని వారు తమ నోటీసులో కోరారు. ఈ అంశాన్ని పూర్తిగా చర్చించి, భారతదేశ ప్రజలకు నిజం వెల్లడించడం చాలా అవసరం అని నోటీసులో పేర్కొన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఎసి) చట్టంపై ఈరోజు ఉదయం 11.30 గంటలకు సభా నాయకుడు జె.పి. నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్జేఎసి చట్టంపై నిర్మాణాత్మక చర్చను నిర్వహించనున్నారు.రాజ్యసభలో సోమవారం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు – 2024ను చేపట్టే అవకాశం ఉంది. నేడు లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక బిల్లు – 2025ను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించనున్నారు.