హైదరాబాదు:హిందూ పండుగల సందర్భంగా పోలీసులు విధిస్తున్న ఆంక్షలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పండుగలు ఏ విధంగా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ఆయన సూటిగా ప్రశ్నించారు. హిందూ పండుగలు వచ్చినప్పుడల్లా డీజేలు, బ్యాండ్లు పెట్టవద్దంటూ ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే గణేశ్ నిమజ్జన ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని రాజాసింగ్ పోలీసుల వైఖరిపై విమర్శలు గుప్పించారు. “ఏదైనా హిందూ పండుగ వస్తే చాలు, పోలీసులు ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డీజేలు పెట్టొద్దు, బ్యాండ్ పెట్టొద్దు అంటారు. మా పండుగలు ఎలా చేసుకోవాలో మీరే నిర్ణయిస్తారా?” అని పోలీసు ఉన్నతాధికారులను ఆయన నిలదీశారు. హనుమాన్ జయంతికి కూడా ఇదే తరహా ఆంక్షలు విధిస్తారని ఆయన గుర్తుచేశారు.గణేశ్ కమిటీ నిర్వాహకులు పోలీసుల ట్రాప్‌లో చిక్కుకోవద్దని రాజాసింగ్ సూచించారు. ఏడాదికి ఒకసారి వచ్చే గణేశ్ నిమజ్జనం రోజున డీజేలు, బ్యాండ్లు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా డీజేలు ఏర్పాటు చేసుకోవాలని, అయితే అసభ్యకర పాటలు కాకుండా మంచి పాటలు పెట్టాలని సలహా ఇచ్చారు. గణేశ్ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులు ఎంతో సహకరిస్తున్నారని రాజాసింగ్ ప్రశంసించారు. వారికి తన తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఒకవైపు కొన్ని ప్రభుత్వ శాఖలు పండుగలకు సహకరిస్తుంటే, పోలీస్ శాఖ మాత్రం ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.