పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

అమరావతి:దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులకు తోడు పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే 60 మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సాయంత్రం ఐదు గంటల వరకు విశాఖ జిల్లా పెందుర్తిలో 81 మి.మీ., అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో 68.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వారాంతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏపీతోపాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos