జమ్ములో రెండోరోజూ కుండపోత.. ఇద్దరు మృతి

జమ్ములో రెండోరోజూ కుండపోత.. ఇద్దరు మృతి

న్యూఢిల్లీ :   జమ్ము ప్రాంతంలో రెండవరోజు బుధవారం కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ, ఆమె కుమార్తె మరణించినట్లు అధికారులు తెలిపారు. వరదలు గ్రామాన్ని ముంచెత్తడంతో 40మంది చిక్కుకుపోయారని అన్నారు. మంగళవారం రాత్రి 8.50గంటలకు వాతావరణ శాఖ (ఐఎండి) వర్షాలపపై తాజా ప్రకటన జారీ చేసింది. రానున్న 14-16 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జమ్ము, కథువా, రియాసి, దోడా, ఉధంపూర్‌, రాజౌరి మరియు రాంబన్‌ జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి శాఖ ప్రతినిధి తెలిపారు.భారీ వర్షాలకు నదులు, వాగులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. మంగళవారం మూసివేసిన శ్రీనగర్‌ -జమ్ము జాతీయ రహదారి సహా మరో రెండు ప్రధాన రహదారులను ఇంకా తెరవలేదని అన్నారు. ఉధంపూర్‌ మరియు బనిహాల్‌ మధ్య అనేక కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశామని అన్నారు.  రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనిలోని కాంగ్రి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఇల్లు కూలిపోయిందని, తల్లి, కుమార్తెలు సజీవ సమాధి అయ్యారని అన్నారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం పంపామని అన్నారు. చీనాబ్‌ నది ప్రమాదకరస్థాయి 42 అడుగులను దాటి నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో అఖ్నూర్‌లోని గర్ఖల్‌ గ్రామంలో సుమారు 40మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు గ్రామానికి చేరుకున్నాయని అన్నారు. బుధవారం ఉదయం 8.00 గంటలకు జమ్మూలోని తావి వద్ద నీటి మట్టం 15 అడుగులుగా నమోదైందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా భగవతి నగర్‌ సమీపంలోని నాలుగవ తావి వంతెనపై మంగళవారం సాయంత్రం వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.ఆగస్ట్‌ 26న రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షపాతానికి ఈ వంతెన దెబ్బతినిందని, అయితే సైన్యం  తాత్కాలిక వంతెనను నిర్మించడంతో కనెక్టివిటీ పునరుద్ధరించబడిందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos