హైదరాబాదు:గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోకముందే భాగ్యనగరానికి మరో భారీ వర్షపు హెచ్చరిక జారీ అయింది. నగరంలో మరో రెండు గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం, హైడ్రా రెస్క్యూ బృందాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గురువారం రాత్రి కురిసిన ఆకస్మిక వర్షానికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపెన్ డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గచ్చిబౌలి, సరూర్‌నగర్, శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో గురువారం రాత్రి 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని, మళ్లీ అదే తరహాలో వర్షం కురిస్తే ఆ ప్రాంతాలు మళ్లీ జలమయం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చని, రోడ్లపై చెట్ల కొమ్మలు, చెత్త పేరుకుపోయి రాకపోకలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పిల్లలను, వృద్ధులను బయటకు పంపకూడదని, వాహనాలను సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాల్లో పార్క్ చేయాలని సూచించారు. వర్ష పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం కోసం జీహెచ్‌ఎంసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను, వాతావరణ శాఖ వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని కోరారు.