అమరావతి: వర్షా కాలంలో వేసవి తరహా వాతావరణంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నెల 13 నాటికి అల్పపీడనం : రాష్ట్రంలో ఆగస్టు నెల ప్రారంభం నుంచి వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎండ తీవ్రత తగ్గే అవకాశముందని, ఈ సీజన్ చివరి వరకు రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వారం రోజులుగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా. తర్వాత వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుపాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.