కృష్ణా జిల్లాలో మేఘగర్జన

కృష్ణా జిల్లాలో మేఘగర్జన

అమరావతి:ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరుణుడు విలయ తాండవం చేస్తున్నాడు. పిడుగులు, భీకర గాలులతో భారీ చెట్లు, విద్యుత్తు స్తంభాలు, రేకుల షెడ్లు, బోర్డులు విరిగిపడ్డాయి. గెలల మీద ఉన్న అరటి, అరకొరగా మిగిలిన మామిడి, కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి పంటలు నేలపాలయ్యాయి. ఆరబోసుకున్న వరి, మొక్కజొన్న, పసుపు తడసిపోయాయి. వడ్డీలకు తీసుకొచ్చి మరీ కష్టపడి పండించిన రైతులకు వరుసపెట్టి కురుస్తున్న వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు తదితర మండలాల్లో మంగళవారం రాత్రి 8 గంటలకు సుమారు 60 నుంచి 70 కి.మీ వేగంతో ఈదురుగాలలతో కూడిన వర్షం దంచికొట్టింది. విజయవాడతో పాటు తిరువూరు, చందర్లపాడు, గంపలగూడెం, ఎ.కొండూరు తదితర మండలాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వాన కురిసింది.విద్యుత్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం: పొలాల్లో పిడుగులు పడి చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రోడ్లకు అడ్డంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగిపడడంతో ట్రాఫిక్, విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. పాకలు, రేకుల షెడ్లలో ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎ.కొండూరు మండలం గోపాలపురంలో ఈదురుగాలలకు ఇబ్రహీంపట్నం-జగదల్పూర్‌ జాతీయ రహదారిపై భారీ వృక్షం విరిగిపడడంతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. బీ చందర్లపాడు మండలం తోటరావులపాడులోని ఓ ఆలయంలో ధ్వజ స్తంభం విరిగిపడింది.

పిడుగుపాటుకు చెలరేగిన మంటలు: ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం ఈలప్రోలు గ్రామంలోని కొత్తూరు మస్తానరావు పొలాల్లో మంగళవారం రాత్రి పిడుగు పడి ఓ తాటి చెట్టు దగ్ధమైంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. పరిసరాల్లో గడ్డివాములు ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. అయితే వాటికి ఎటువంటి మంటలు వ్యాపించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ క్రమంలో మంటలు ఉవ్వెత్తున లేచి పడటాన్ని స్థానికులు తమ చరవాణుల్లో చిత్రీకరించి వైరల్‌ చేశారు. భారీ గాలులకు ముప్పాళ్ల-చందర్లపాడు, చందర్లపాడు-కొడవటికల్లు గ్రామాల మధ్య రహదారిపై భారీ చెట్లు విరిగి పడిపోయాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లటంతో ఎస్సై దుర్గా ఉమామహేశ్వరరావు పొక్లెయిన్‌తో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించారు. తోటరావులపాడులోని విఘ్నేశ్వరాలయంలో ధ్వజస్తంభం నేలవాలింది. కొద్దిపాటి వర్షం కురవడంతో పొలాల్లో ఆరబోసిన మిర్చి, పసుపుకొమ్ములు, మొక్కజొన్నలు తడవకుండా కాపాడుకోవడానికి అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos