పాట్నా : బీహార్ ప్రజలు చాలా తెలివైనవారు. వారు బిజెపి, ఎన్నికలసంఘం చేత ఒక్క ఓటుని కూడా దొంగిలించనివ్వరు అని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం ఆయన సీతామర్హిలో జరిగిన ఓటర్ అధికార్ యాత్రలో మాట్లాడారు. ఓట్లచోరీపై ఆయన బిజెపి ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు. పేద ప్రజల గొంతును నొక్కేసేందుకే.. బిజెపి వారి ఓట్లను దొంగిలించింది. అయితే పేద ప్రజల గొంతును నొక్కే ప్రయత్నానికి ఇండియా కూటమి ఒప్పుకోదు. పేద ప్రజలకు అండగా ఉంటుంది అని అన్నారు. ‘వారు బీహార్ ఎన్నికల్లో ఓట్లను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని మాకు తెలుసు. అందుకే మేము ఓటర్ అధికార్ యాత్రను ప్రారంభించాము. బీహార్ ప్రజలు తెలివైనవారు. బిజెపి, ఎన్నికల కమిషన్ చేత ఓట్లు చోరీ కాకుండా జాగ్రత్తగా ఉన్నారు. అంబేద్కర్‌జీ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగ పుస్తకం సాధారణ పుస్తకం కాదు. అది భావజాలం ప్రతిబింబాల పుస్తకం’ అని అన్నారు.దళిత సోదరుల్ని స్వాతంత్య్రానికి ముందు అంటరానివారిగా పరిగణించారు. కానీ అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం వారికి హక్కుల్ని ఇచ్చింది. కానీ బిజెపి వారి హక్కుల్ని లాగేసుకుంటుంది. వారి గొంతుల్ని నొక్కేందుకు పేదల ఓట్లను దొంగిలిస్తున్నారు. నేను చెబుతున్నాను… మీ గొంతును బిజెపి వారు నొక్కేయలేరు. మేము మీ వెంట నిలబడతాం’ అని రాహుల్ అన్నారు.