అజ్మీర్: కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని అన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో రాహుల్ శనివారంనాడు పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏదో ఒకటి ఎంచుకోండంటూ ప్రధాని కొన్ని ఆప్షన్లు చెబుతున్నారనీ, ఆ మూడు ఆప్షన్లలో ఒకటి ఆకలి, రెండవది నిరుద్యోగం, మూడవది ఆత్మహత్యలు అని అన్నారు. రైతులతో మాట్లాడతామని ఆయన చెబుతున్నారని, రైతులు మాత్రం చట్టాలు రద్దు చేసేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది భరతమాతకు చెందినదని, పారిశ్రామిక వేత్తలకు చెందినది కాదని రాహుల్ కుండబద్ధలు కొట్టారు. అంతకుముందు, రాహుల్ తన పర్యటనలో భాగంగా రూపన్‌గఢ్‌లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.