మోదీ విద్యార్హత ఏమి? రాహుల్

ఇంఫాల్‌ : ప్రధాని నరేంద్ర మోదీ తన విద్యార్హత ఏమిటో లోకానికి చాటి చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండు చేసారు. బుధవారం ఇంఫాల్‌లో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ‘విశ్వ విద్యాలయాకు వెళ్లని వారికి నేను వ్యతిరేకం కాదు. విశ్వ విద్యాలయాలకు వెళ్లని వాళ్లకూ విశేష ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి. మోదీ కూడా విశ్వ విద్యాలయంలో చదువు కున్నానని చెబుతున్నారు. ఏ విశ్వ విద్యాల యంలో పట్ట భద్రులయ్యారో ఇప్పటికీ తెలియదు. అసలు ఆయన విశ్వ విద్యాలయానికి వెళ్లారో, లేదో కూడా ఎవరికీ తెలియదు. ప్రధాని డిగ్రీ పై ఢిల్లీలో ఒక సమాచార హక్కు కార్యకర్త చిరకాలంగా పోరాడుతున్నారు. ఇంత వరకు ఆయనకు సమాచార హక్కు అధికార్లు సమాధానం చెప్ప లేదు’ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాల వల్ల దేశంపై ప్రతికూల ప్రభావం పడుతోందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యకు ప్రతిగా రాహుల్ ఈ మేరకు స్పందించారు.
మోదీ పరిపాలన తీరుతో 2018లో రోజూ 30,000 ఉద్యోగాలు ఊడిపోయాయని మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌ లో బుదవారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ విమర్శించారు. దేశంలో కోటి ఉద్యోగాలు సృష్టిస్తానని ఊదరగొట్టిన మోదీ వల్ల 2018- ఒక్క ఏడాదిలోనే కోటి ఉద్యోగాలను దేశం కోల్పోయిందని ధ్వజ మెత్తారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా అందుబాటులోకి తేకుండా 2018లో మోదీ ప్రతిరోజూ 30,000 ఉద్యోగాలను నాశనం చేశారని దుయ్యబట్టారు. ఈశాన్య భారతంలో ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. ఆర్థిక అంశాలపై అవగాహన లేకుండా మోదీ చేపట్టిన నోట్ల రద్దు ప్రహసనంలా మారిందని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos