ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కర్ణాటక నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఉబలాటపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథి నియోజకవర్గాన్ని ఆయన తన తండ్రి నుంచి వారసత్వంగా తీసుకుని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కర్ణాటక నుంచి కూడా పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అనంతర రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో కర్ణాటకలోని చిక్కమగళూరు నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తల్లి సోనియా గాంధీ కూడా బళ్లారి నుంచి పోటీ చేసి ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై గెలుపొందారు. అప్పట్లో లోక్‌సభతో పాటు శాసన సభ ఎన్నికలు కూడా జరగడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామ క్రమంలో దక్షిణాదిలో ఏదో ఒక స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో కాంగ్రెస్కు సురక్షితమైన స్థానమంటూ లేదు. కేరళలో ఎప్పుడూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య పోటా పోటీ ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుతో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 20, జేడీఎస్ ఎనిమిది స్థానాల్లో పోటీ చేసేలా ఇరు పార్టీల మధ్య ఒప్పందం ఖరారైంది. బీజేపీ హవాలో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏడెనిమిది స్థానాల్లో కచ్చితంగా గెలుస్తూ వచ్చింది. ఆ రకంగా ఆ పార్టీకి సురక్షితమైన స్థానాలున్నాయి. గత ఏడాది ఆఖరులో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో బళ్లారి స్థానాన్ని కాంగ్రెస్, బీజేపి నుంచి హస్తగతం చేసుకుంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ గెలుస్తూ వచ్చింది. తక్కువ కాల పరిమితి ఉన్నందున ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులెవరూ ఆసక్తి చూపకపోవడంతో స్థానికేతరుడైన వీఎస్. ఉగ్రప్ప అనే నాయకుని కాంగ్రెస్ పోటీలో దించింది. ఆయన అనూహ్యంగా భారీ మెజారిటీతో గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణులనే ఆశ్చర్యపరిచింది. కనుక కర్ణాటకలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని, ఇక్కడ ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని రాహుల్‌పై ఒత్తిడి పెరుగుతోంది.