పాట్నా: మోదీ ప్రభుత్వం శ్రీమంతుల రుణాల్ని మాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహించారు. మంగళవారం బిహార్లోని పలు ప్రాంతాల్లో శాసనసభ ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ప్రసంగించారు. ‘కోవిడ్-19పై ప్రకటనలు చేయడం తప్పితే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిందేమీ లేదు. లాక్డౌన్ కారణంగా దేశంలో అత్యంత ఇబ్బందులు ఎదుర్కొన్నది బిహారీలే. ఎన్డీయే 15 ఏళ్లుగా బిహార్ను పాలిస్తోంది. మరెందుకు బిహారీలు ఇంతగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు? మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. దాని వల్ల పేదలు ఇబ్బందులు పడ్డారు, వెయ్యి రూపాయల కోసం లైన్లలో నిల బడ్డారు. ధన వంతులు ఇంటి నుంచి కదలకుండానే కోట్లు మార్చుకున్నారు. ఒక పేదల రుణ భారాల్ని పెంచి 3.5 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు రద్దు చేశారు. పేదల పొట్ట కొట్టి పెద్దల కడుపు నింపేదే మోదీ ప్రభుత్వం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.