పేదల సొంతింటి కోసం కలలు కనే హక్కును కోల్పోయారు

పేదల సొంతింటి కోసం కలలు కనే హక్కును కోల్పోయారు

న్యూఢిల్లీ :   పేదలు సొంతింటి కోసం కలలు కనే హక్కును కోల్పోతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరల గురించి మాట్లాడుతూ.. గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని పట్టణ కుటుంబాలలో ఆదాయపరంగా అగ్రస్థానంలో ఉన్న 5శాతం కుటుంబాలు కూడా, ముంబయిలో ఇల్లు కొనడానికి 100 సంవత్సరాలకు పైగా పొదుపు అవసరమన్న   మీడియా నివేదికను రాహుల్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ”అవును.. మీరు చదివినది వాస్తవమే. మీరు నమ్మకపోతే నేను మరోసారి చెబుతున్నాను. ముంబయిలో ఇల్లు కొనడానికి, భారతదేశంలోని ఐదుశాతం మంది ధనవంతులు కూడా 109 సంవత్సరాలు తమ ఆదాయంలో 30శాతం ఆదా చేసుకోవాలి” అని రాహుల్‌ గాంధీ పోస్ట్‌లో పేర్కొన్నారు. ”మెట్రో నగరాల పరిస్థితి ఇది, అక్కడ మీరు కనీస అవసరాల  కోసం కష్టపడి పనిచేస్తారు. అటువంటప్పుడు అంత పొదుపు ఎక్కడి నుండి వస్తుంది” అని ప్రశ్నించారు.పేదలు, మధ్యతరగతి ప్రజలకు వారసత్వంగా సంపద రాదని, బాధ్యతలు వస్తాయని అన్నారు. పిల్లల ఖరీదైన విద్య, ఖరీదైన చికిత్స గురించి ఆందోళన, తల్లిదండ్రుల బాధ్యత లేదా కుటుంబానికి చిన్నకారు వంటి బాధ్యతలు ఉంటాయని అన్నారు. కానీ ఎప్పటికీ వారి హృదయాలలో ఒక కల ఉంటుందని, ఏదో ఒక రోజు మనకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారని అన్నారు. కానీ, ధనవంతులకే 109 సంవత్సరాల దూరంలో ఉన్నప్పుడపు.. పేదల సొంతింటి కల ఎలా తీరుతుందని, వారు కలలు కనే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికుటుంబానికి సౌకర్యవంతమైన సొంత ఇల్లు అవసరం కానీ దురదృష్టవశాత్తు సొంత ఇంటి కోసం వారి మొత్తం జీవితకాలపు కృషి, పొదుపు కంటే ఎక్కు ఖర్చు పెట్టాల్సిందేనని అన్నారు. ”ఎవరైనా మీకు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) గణాంకాలను గురించి చెప్పినపుడు.. మీ దేశీయ బడ్జెట్‌ గురించి వాస్తవాలను చూపమనండి.. ఈ ఆర్థికవ్యవస్థ ఎవరి కోసం” అని నిలదీయాలని ప్రజలకు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos