లోక్‌సభలో రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు

లోక్‌సభలో రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు

న్యూ ఢిల్లీ : లోక్సభ లో బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో లోక్సభలో ఆయన చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహా అగ్నివీర్, మైనార్టీ, నీట్ పరీక్షల్లో అక్రమాలు తదితర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు రాహుల్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది.ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా రాహుల్పై చర్యలు చేపట్టారు. రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా వెల్లడించింది. స్పీకర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, నీట్ పరీక్షల్లో అక్రమాలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను తొలగించినట్లు వివరించింది. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పరమశివుడి చిత్రపటాన్ని చూపిస్తూ.. ‘హిందువులు ఎప్పుడూ భయాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేయరు. కానీ, హిందువులుగా చెప్పుకునే కొందరు మాత్రం కేవలం హింస, విద్వేషం, అసత్యమే మాట్లాడతారు. మీరు హిందువులే కాదు’ అంటూ బీజేపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో మతపరమైన చిత్రాలను చూపించ వద్దంటూ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ను నిలువరించే ప్రయత్నం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos