మోదీ సర్కారు అన్నిటా వైఫల్యం..రాహుల్ ధ్వజం

మోదీ సర్కారు అన్నిటా వైఫల్యం..రాహుల్ ధ్వజం

హావేరి, న్యూస్‌ఎక్స్‌ప్రెస్‌ : అయిదేళ్ల పాలనలో కేంద్రంలోని మోదీ సర్కారు చెప్పుకోదగ్గ సాధన ఒక్కటైనా లేదని, పైగా నిరుద్యోగం తాండవిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సన్నాహకంగా కర్ణాటకలోని హావేరిలో శనివారం జరిగిన పరివర్తనా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశాన్ని దోచుకున్న వారిని వదలబోదని, మతం పేరిట సమాజాన్ని చీల్చడాన్ని అనుమతించబోదని హెచ్చరించారు. కర్ణాటకలో తమ సంకీర్ణ ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని ప్రకటిస్తే, లాలీపాప్‌గా అభివర్ణించిన మోదీ, రైతుల ఖాతాల్లో ఏటా నేరుగా రూ.6 వేలు నగదు బదిలీ చేస్తానని చెప్పడం…దేనికి సంకేతమని ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోదీ, మళ్లీ అవే హామీలను ఇప్పుడూ గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన అయిదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్య గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుందని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు ఆయన అధికారంలోకి వస్తే, ప్రతి భారతీయుని ఖాతాలోకి రూ.15 లక్షలు వేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని దెప్పి పొడిచారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు, మధ్య తరగతి కుటుంబాల బతుకులను కకావికలం చేశారని ఆరోపించారు. పేదల సొమ్మును అనిల అంబానీ, నీరవ్‌ మోదీ లాంటి బడా బాబులకు అప్పగించారని ఆరోపించారు. జైష్‌ అధినేత మసూద్‌ అజార్‌ను పాకిస్తాన్‌కు అప్పగించింది బీజేపీ వారేనని గుర్తు చేశారు. కనుక ఇప్పుడు పుల్వమాలో జరిగిన ఉగ్ర దాడిలో 45 మంది వీర జవానులు మరణించడానికి కారణం కూడా బీజేపీయేనని ఆరోపించారు. ఎన్నో యుద్ధ విమానాలను తయారు చేసిన ఘన చరిత్ర కలిగిన హెచ్‌ఏఎల్‌ను కాదని రఫేల్‌ యుద్ధ విమానాల తయారీని ఈ రంగంలో ఏమాత్రం అనుభవం లేని అనిల్‌ అంబానీకి అప్పగించారని దుయ్యబట్టారు. తద్వారా రూ.30 వేల కోట్ల ప్రజా ధనాన్ని ఆయనకు అప్పగించడానికి ప్రధాని సిద్ధమయ్యారని రాహుల్‌ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos