దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల దాడికి దిగారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను కేంద్రం అకస్మాత్తుగా సెలవుపై పంపడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. అంతేగాక.. ఈ ప్రశ్నలకు జవాబు కూడా ఆయనే చెప్పారు. అన్నింటికీ సమాధానం రఫేల్ ఒప్పందమే అని రాహుల్ ఈ సందర్భంగా దుయ్యబట్టారు.
‘1వ ప్రశ్న: సీబీఐ చీఫ్‌ను తొలగించేందుకు ప్రధాని మోదీ ఎందుకు అంత తొందరపడ్డారు?
2వ ప్రశ్న: సెలక్షన్ కమిటీ ముందు తన కేసును ఉంచేందుకు సీబీఐ చీఫ్‌కు ఆయన(మోదీని ఉద్దేశిస్తూ) ఎందుకు అనుమతివ్వలేదు?
జవాబు: ‘రఫేల్’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పరస్పర అనినీతి ఆరోపణలతో సీబీఐ వివాదం రచ్చకెక్కింది. దీంతో వీరిద్దరినీ సెలవుపై పంపిస్తూ గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆలోక్‌వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆలోక్‌వర్మ బుధవారం తిరిగి విధుల్లో చేరారు.