
డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకునే కొంతమంది సినీనటులు,క్రికెటర్లు ఏమాత్రం ఆలోచించకుండా వాణిజ్య ప్రకటనల్లో నటించి అనంతరం సరదు సంస్థలు నకిలీవని తెలుసుకొని కోర్టులు చుట్టూ తిరగడం దశాబ్ద కాలంగా ఎక్కువగా జరుగుతోంది.తాజాగా క్యూనెట్ మల్టీ లెవెల్ కంపెనీ మోసాల తాలూకు పలువురు నటీనటులు, క్రికెటర్లు తాఖీదులు అందుకున్నారు. మల్టీ లెవెల్ మోసం.. బ్రాండ్ అంబాసిడర్లకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.క్యూనెట్ సంస్థ వాణిజ్య ప్రకటనల్లో నటించిన నటీనటులకు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు.ప్రముఖులు వాణిజ్య ప్రకటనల్లో నటించడంతోనే తాము క్యూనెట్ సంస్థలో చేరి భారీగా నష్టపోయామంటూ ప్రజలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు బాలీవుడ్ స్టార్‌నటీనటులైన షారుఖ్‌ఖాన్, బొమన్‌ఇరానీ, పూజాహెగ్డే,టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్‌తో పాటు క్రికెటర్ యువరాజ్‌సింగ్‌లకు నోటీసులు జారీ చేసారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్ పోలీసుల నోటీసులు అందుకున్న ఈ సెలబ్రిటీలు క్యూనెట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ తో జనాల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన క్యూనెట్ ఛీటింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.మల్టీలెవెల్ మార్కెటింగ్ తో క్యూనెట్ సంస్థ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసి సుమారు రూ.1,000 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టింది.దీనికి సంబంధించి 14 కేసులు నమోదు కాగా 58 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్ అనే ఇద్దరు వ్యక్తులు 1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూవన్ గ్రూపును స్థాపించారు. అయితే అందులో నష్టాలు రావడంతో దాన్ని మూసేసిన ఇరువురు 2001లో భారతదేశానికి వచ్చి గోల్డ్‌క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల్లో ఆరితేరిన జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్.. నిరుద్యోగులే టార్గెట్ గా వ్యాపార కార్యకలాపాలు విస్తరించేవారు.తక్కువ సమయంలో కోటీశ్వరులుగా మారే అవకాశం తాము కల్పిస్తామని ఒక్కసారి తమ సంస్థలో పెట్టుబడులు పెడితే నెలనెలా ఆదాయం కుప్పలుతెప్పలుగా వస్తుందంటూ నమ్మిస్తారు. ఇలా లక్షలాది రూపాయలు కట్టించకున్న అనంతరం డబ్బుల కోసం వచ్చే ప్రజలు,నిరుద్యోగులను ఇదిగో,అదిగో అంటూ నెలల తరబడి తిప్పించుకుంటారు. దాని తర్వాత అసలు కథ మొదలెడతారు. గొలుసుకట్టు మాయాజాలం నూరిపోస్తారు. బంధువులు, స్నేహితులను చేర్పిస్తూ సంస్థ ఉత్పత్తులు అమ్మితేనే మీకు కోట్లు వస్తాయంటూ మరో కొత్త కథకు తెర తీస్తారు. ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో లక్షలాది మందిని మోసగించారు.