మరో గొలుసుకట్టు మోసానికి సైబరాబాద్ పోలీసులు కళ్లెం వేశారు. విదేశాల్లో పురుడు పోసుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మందిని సభ్యులుగా చేర్చుకుంటూ అనుబంధ సంస్థల్ని సృష్టిస్తున్న ‘క్యూనెట్’ మల్టీలెవల్ మార్కెటింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో వందల మందిని మోసం చేసిన క్యూనెట్ అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రై.లిమిటెడ్‌పై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, రాయదుర్గం ఠాణాల్లో ఇటీవలే 14కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు క్రమంలో ఆ సంస్థ ప్రమోటర్లు 58మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. బెంగళూరులో సంస్థ గోదాంను సీజ్ చేసి బ్యాంకు ఖాతాల్లోని రూ.2.7కోట్ల నగదును స్తంభింపజేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం వెల్లడించారు. క్యూనెట్‌పై ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్‌లో మొత్తం 30కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థపై ఉన్న 8 కేసుల్ని సీఐడీ దర్యాప్తు చేస్తోందన్నారు.
క్యూనెట్ పేరు దాచి..
1998లో విజయ్‌ఈశ్వరన్, జోసెఫ్ బిస్మార్క్‌లు హాంకాంగ్‌లో క్యూనెట్‌ను ప్రారంభించారు. 2008లో సంస్థలో చేరిన ట్రెవర్‌కూనాను సీఈవోగా నియమించారు. సంస్థలో చేరిన ఒక సభ్యుడు మరో ఇద్దరిని చేర్పించాలంటూ గొలుసుకట్టు తరహాలో సాగే ఈసంస్థ కార్యకలాపాలు భారత్, ఫిలిప్పీన్స్, కాంబోడియా, నేపాల్, ఇండోనేసియా, టర్కీ, సౌదీ, రష్యాకు విస్తరించాయి. భారత్‌లో క్యూనెట్‌కు అనుబంధంగా విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థలో ఫార్ములా వన్ రేసర్ మైఖేల్‌ఫెరీరా, మాల్కందేశాయ్ భాగస్వాములుకాగా దిలీప్‌రాజ్ పోకెళ్ల, ఎండీ ఇంతియాజ్ సంచాలకులు. గతంలో హైదరాబాద్‌లోనూ సంస్థ కార్యకలాపాలు భారీఎత్తున సాగాయి. అప్పట్లో కేసులు నమోదుకావడంతో కొత్తసభ్యులకు క్యూనెట్ పేరు చెప్పకుండా గడియారాలు, నగలు, పర్యాటకప్యాకేజీలు, ఆరోగ్యఉత్పత్తులు తదితర వ్యాపారాలపేరుతో పెట్టుబడులు పెట్టించడం ఆరంభించారు. కోటీశ్వరులవుతారనే భ్రమలు కల్పిస్తూ ఐటీకారిడార్‌లో వందల సంఖ్యలో సభ్యులను చేర్పించుకున్నారు. పెట్టుబడి కోసం బ్యాంకు రుణాలిప్పించి మరీ సభ్యులుగా చేర్పించారు. వ్యాపారం నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తామంటూ హామీలిచ్చారు. రోజులు గడిచినా వ్యాపారంలో లాభాలు రావడం లేదని నిలదీస్తే మరో ఇద్దరిని చేర్పించి, వారి ద్వారా మరో నలుగురు..ఇలా గొలుసుకట్టు మాదిరిగా సభ్యులు చేరితే తప్ప లాభాలు రావని చెప్పేవారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసలు డబ్బు కోసమైనా కొత్తసభ్యుల కోసం బాధితులు మోసాల్లో భాగస్వాములయ్యేవారు. కొందరు కొత్తసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించడంతో తాజాగా 14కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేర నియంత్రణ విభాగం పోలీసులు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు గుర్తించారు. సభ్యులకు సంబంధిత ఉత్పత్తుల్ని అక్కడినుంచే సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. ట్రాన్స్‌వ్యూ ఎంటర్‌ప్రైజెస్‌పేరుతో నిర్వహిస్తున్న గోదాంను సీజ్‌చేశారు. సంస్థకు చెందిన ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. తాము మోసపోయామని గ్రహించినా..ఇతరులను చేర్పించినందుకు 53మంది సభ్యులను నిందితుల జాబితాలో చేర్చి అరెస్ట్ చేశారు.