ముంబై : రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన అన్ని ఖాతాల్ని జాతీయ బ్యాంకులకు మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశించింది. ఎస్ బ్యాంక్ సంక్షోభం కారణంగా ప్రైవేటు బ్యాంకులకు ఉద్వాసన చెప్పి జాతీయ బ్యాంకుల బాట పట్టాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు యోచి స్తున్న దశలో మహారాష్ట్ర ఈ నిర్ణయాన్ని తీసుకుంది.’అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగం సంస్థలు, కార్పొరేషన్లు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ జాతీయ బ్యాంకులతోనే ముడిపడేలా చూసుకోవాలి’ అని ప్రభుత్వం తీర్మానించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో ప్రారంభించిన ఖాతాల్ని ఏప్రిల్ 1 కల్లా మూసేయాలని ఆదేశించింది. ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు ప్రభుత్వ బ్యాంకుల నుంచి మాత్రమే చెల్లించేలా చూసుకోవాలనీ, ఫించనుదార్లు తమ ఖాతాల్ని జాతీయ బ్యాంకులకు బ్యాంకులకు మార్చుకోవాలనీ సూచించింది. ‘ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు వద్దు. ప్రైవేటు బ్యాంకుల్లోని ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వాలు మార్చవద్ద’ని ఆర్బీఐ గత గురువారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు చేసిన వినతిని మహారాష్ట్ర సర్కార్ బుట్ట దాఖలు చేసింది.