మాస్కో: తన దృష్టిలో ఉక్రెయిన్ మొత్తం రష్యాకు చెందినదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. పరిస్థితి మరింత దిగజారకముందే చర్చలకు రావాలని కీవ్‌కు పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ, “రష్యన్లు, ఉక్రెయిన్లు చారిత్రకంగా ఒక్కటే. ఈ లెక్కన చూస్తే ఉక్రెయిన్ మొత్తం మాదే అవుతుంది. అయినప్పటికీ, కీవ్ సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలను ఉక్రెయిన్ అంగీకరించాలని, మాస్కో భౌగోళిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని నొక్కిచెప్పారు. “సరిహద్దు వెంబడి నిరంతర కాల్పులతో ఉక్రెయిన్ మాకు ముప్పు కలిగిస్తోంది. అందుకే, ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మా బలగాలు సుమీ ప్రాంతంలోకి సుమారు 10 కిలోమీటర్ల వరకు వెళ్లాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం మా లక్ష్యం కాదు. కానీ, పరిస్థితి తీవ్రంగా మారితే, దానిని మా అధీనంలోకి తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం” అని హెచ్చరించారు.ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆశను వదులుకోవాలని పుతిన్ గట్టిగా సూచించారు. “ఈ సైనిక చర్య మీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. అది మరింత తీవ్రరూపం దాల్చకముందే మాతో చర్చలకు వచ్చి, ఒక ఒప్పందం చేసుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే, ఆ ప్రాంతం మాదే అవుతుందన్న నిజాన్ని గుర్తుంచుకోవాలి” అంటూ పుతిన్ ఉక్రెయిన్‌ను హెచ్చరించారు. ఉక్రెయిన్ లొంగిపోవాలని తాము కోరుకోవడం లేదని, కానీ వాస్తవాలను అంగీకరించి ముందుకు సాగాలని ఆయన వ్యాఖ్యానించారు.