ఢిల్లీ : నేడు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ ను ప్రవేశపెట్టినపుడు పలువురు కాంగ్రెస్ సభ్యులు నల్లచొక్కాలతో హాజరయ్యారు. నూతన వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం, రైతాంగం, కార్మిక రంగానికి బడ్జెట్ 2021 లో అండగా నిలవాలని సూచించారు. కరోనా కారణంగా ప్రజల ప్రాణాల రక్షణకు వైద్యారోగ్య రంగానికి, సరిహద్దు వివాదాల వల్ల రక్షణ రంగానికి నిధుల కేటాయింపులు పెంచాలని సూచించారు.