ఢిల్లీలో జనవరి 26న ఎద్దులు, నాగళ్లతో నిరసన

న్యూ ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల వెంబడి రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం 28వ రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. బుధవారం -రైతు దినోత్సవం సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ విలేఖరులతో మాట్లాడారు. ‘దేశంలో నాగలి, ఎద్దుల విప్లవంపై నిషేధం ఉందా? మా మనస్సులకు ఎంతో దగ్గరైన నాగలి, ఎద్దులతో మేము విప్లవం రగిలిస్తాం. మేము ప్రభుత్వానికి రైతుల శక్తేమిటో చూపిస్తాం. దిల్లీ వీధుల్లో జనవరి 26న ఎద్దులు, నాగళ్లతో నిరసిస్తాం. ఇదో కొత్త రకం పరేడ్. ప్రభుత్వం రైళ్లు నడిపితే దేశం నలుమూలల నుంచి రైతులు దిల్లీకి వస్తారు. కరోనా వైరస్ గురించి మమ్మల్ని భయపెడుతున్నారు. తెలంగాణ, బిహార్ ఎన్నికలు ఎలా జరిపారు. రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వాటిని మా ఉద్యమంలో జోక్యం చేసుకోనివ్వ లేదు. మేము కూడా గత ఏడేళ్లుగా వేచి చూసి విసిగి వేసారి ఉద్యమం చేస్తున్నాం. మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదు. వేచి చూస్తే వెళ్లిపోతారనే అపోహను ప్రభుత్వం వీడాలి. ఎం.ఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. మోదీ సిబ్బంది తప్పుడు నివేదికలతో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. మేము దేశానికి ఆహారం అందిస్తుంటే.. మాపై పోలీసుల దాడులు చేస్తున్నారు. మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నా ప్రభుత్వం మాకు సహకారం అందించడం లేదు. మా డిమాండ్లను కనీసం గౌరవించడం లేదు. డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమం ఇలానే కొనసాగుతుంది. దేశం స్వాతంత్ర్యం కోసం 90 ఏళ్లు శ్రమించింది. రైతులకు ఎప్పుడు స్వేచ్ఛ లభిస్తుందో తెలియదు కానీ పోరు మాత్రం కొనసాగుతుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos