రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ 25 రోజులకు పైగా నిరసనలు,ఉద్యమాలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు,ప్రజలకు చిత్రపరిశ్రమ నుంచి కొద్దికొద్దిగా మద్దతు లభిస్తోంది.ఇప్పటికే హీరో నారా రోహిత్,పాప్ గాయని స్మిత అమరావతి రైతులకు మద్దతు తెలపగా తాజాగా నిర్మాత అశ్వనీదత్ సైతం రైతులకు సంఘీభావం తెలిపారు.మందడంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నా మందడానికి వెళ్లిన సినీ నిర్మాత అశ్వనీదత్ రైతులకు సంఘీభావం తెలిపారు. తమ ఆందోళనల గురించి అశ్వనీదత్కు రైతులు వివరించి చెప్పారు. రాజధాని కోసం తాము భూములు ఇచ్చిన విషయాన్ని, ప్రభుత్వం మారగానే అమరావతి చుట్టూ జరుగుతోన్న పరిణామాలను అశ్వనీదత్కు తెలిపారు.మందడంలో రైతుల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ రైతులు ఆందోళనలను విరమించకుండా నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రైవేటు స్థలంలో కూర్చొని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ సమయంలో అశ్వనీదత్ వారిని కలవడం గమనార్హం. మందడంలో రైతులు ఓ చోట టెంటు వేసుకుని దీక్షకు దిగిన ప్రాంతానికి వెళ్లి ఆయన చర్చించారు.