అఖిల్ గొగొయి జైల్లో ఉన్నారు. ఆయన తరఫున 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియాద ఎన్నికల ప్రచారం చేశారు. అస్సాంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిల్ సుమారు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అఖిల్ సామాజిక కార్యకర్త. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో ప్రదర్శనలు నిర్వహించి 2019 డిసెంబరులో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల్లో తన సొంత పార్టీ – రైజోర్ దళ్ అభ్యర్థిగా శివ సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. చెరసాల నుంచి బయటికి వచ్చి ప్రచారం చేయడానికి లేదు.దీంతో ఆ బాధ్యతను వృద్ధురాలైన తల్లి ప్రియాద చేపట్టారు. భుజంపై వేసుకున్నారు. ఆమె ఆశ ఒక్కటే. తన కొడుకు గెలిస్తే విముక్తి లభిస్తుందని.శివసాగర్లో ఇంటింటికి తిరిగారు. వేసవి గాలుల్ని, తన హృద్రోగాన్ని, సహకరించని కంటి చూపును లక్ష్య పెట్టలేదు. ఆ మాతృమూర్తి పట్టుదలకు చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండే ఆమెకు తోడుగా ప్రచారానికి వచ్చారు. ఆ తల్లి శ్రమ ఫలించింది. అఖిల్ గెలిచాడు. ఇక అతడికి బెయిలు రావడమే మిగిలింది.