హైదరాబాద్ : నటుడు పోసాని కృష్ణ మురళి ఎన్నికల సంఘం తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. తాను తీస్తున్న ముఖ్యమంత్రి గారు…మీరు మాట ఇచ్చారు అనే సినిమాను నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి మార్కండేయులు అనే అధికారి లేఖ పంపారని తెలిపారు. దీనికి తాను మూడు పుటల వివరణ ఇచ్చానన్నారు. సినిమాలో ఏముందో చూడకుండానే, దానిని నిలిపివేయాలంటూ లేఖ ఎలా పంపుతారని నిలదీశారు. తాను ఆ సినిమాలో ఎవరినీ తిట్టలేదని తెలిపారు. మోహన్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సినిమాను నిలిపివేయాలని ఈసీ లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సెన్సార్ నిబంధనలకు లోబడే సినిమాను తీశానని, మేనిఫెస్టోలోని అంశాలనే సినిమాలో చూపించానని ఆయన వివరించారు.