పోలీసుల ఇన్వెస్టిగేషన్ అంటే.. ఎంత పెద్ద నేరమో అన్న ఆలోచన అందరికీ కలుగుతుంది. కానీ కుషాయిగూడ పోలీసులు ఓ విచిత్రమైన ఇన్వెస్టిగేషన్‌కు దిగారు. ఓ చీటింగ్ కేసులో పట్టుబడ్డ దొంగ.. ఆడా … మగా తేల్చుకునే పనిలో పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ అరుదైన ఘటన వివరాల్లోకి వెళితే.. అద్దెకు కార్లు తీసుకుని అమ్మేస్తున్న సిరాజ్ హుస్సేన్, పోతులయ్యలను ఈ నెల 3న కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు డైరీ రాస్తున్న సమయంలో పోలీసులకు అసలైన ట్విస్ట్ ఎదురయ్యింది. శ్రీనగర్ కాలనీకి చెందిన సిరాజ్ హుస్సేన్ వివరాలు రాస్తుండగా… లింగ నిర్ధారణ కాలం దగ్గర ఆగిపోయారు. సిరాజ్ గొంతు విషయంలో ఉన్న తేడానే ఈ గందరగోళానికి కారణం. అమ్మాయి వాయిస్‌లా ఉండటంతో.. గట్టిగా ప్రశ్నించారు. తన అసలు పేరు షబీనా అస్మీ అని, సొంతూరు కరీంనగర్ జిల్లా ఫతేపూర్ నగర్ అని చెప్పుకొచ్చాడు. పుట్టుకతో ఆడపిల్లగా పుట్టిన తాను.. ముంబైలో లింగమార్పిడీ ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపాడు. మూడేళ్లుగా వైద్యం నడుస్తుందని చెప్పాడు. ఈ విషయంలో వైద్యుల అధికారిక సమాచారం కోసం.. గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు. అక్కడి వైద్యుల నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసులో తర్వతి దర్యాప్తు ఉంటుందని కుషాయిగూడ ఎస్‌హెచ్ఓ తెలిపారు. అయితే ఈ కేసులో మరిన్ని అనుమానలు తలెత్తుతున్నాయి. సిరాజ్ చెప్పింది నిజమే అయితే.. లింగమార్పిడీకి కావలసిన డబ్బును ఎవరు సమకూర్చారు.. ఎందుకు చేయించుకున్నారన్న ప్రశ్నలకు జవాబులు రాబట్టాల్సి ఉంటుంది.