న్యూ ఢిల్లీ: కరోనా కట్టడిలో ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనొక ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యినించారు. శుక్రవారం వర్చువల్ విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కోవిడ్పై పోరాటం ఎలా చేయాలో, వైరస్ మ్యుటేషన్ వల్ల ప్రమాదాలేమిటో కూడా ప్రభుత్వం అర్ధం చేసుకోలేకపోతోందని అన్నారు. ‘మీరు తలుపులు తెరిచి పెట్టారు. ఇప్పటికే తలుపులు మూయలేదు. జనాభాలో 3 శాతానికే మీరు టీకాలు వేసారు. మిగతా 97 శాతాన్ని వదిలేశారు. అమెరికాలో 50 శాతం జనాభా టీకాలు తీసుకున్నారు. బ్రెజిల్లో 8 నుంచి 9 శాతం టీకాలు వేసారు. అవి మనలా టీకాల రాజధానులు కావు, కానీ మనం టీకాల్ని తయారు చేస్తున్నాం” అని అన్నారు. ‘కరోనా మొదటి దాడిని ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు. కానీ రెండవ దాడికి మాత్రం ప్రధానిదే బాధ్యత. కోవిడ్ మరణాల గురించి ప్రధాని అన్నీ అబద్ధాలాడుతున్నారు. ఇండియా టీకా వ్యూహం సరిగ్గా అమలు చేయకుంటే అనేక కరోనా దాడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధానికి నేను నేరుగా చెప్పాను. కరోనాను దేశం నుంచి తరమికొట్టేందుకు అందరికీ టీకాలు వేయటమే ఇవ్వడమే ఏకైక మార్గం. ప్రస్తుత టీకాల రేటు ఇదే రకంగా కొనసాగితే మాత్రం, మూడు, నాలుగో దాడుల్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంద’ని హెచ్చరించారు.‘ఇవాళ మనమంతా కరోనాతో యుద్ధం చేస్తున్నాం. కేంద్రం మాత్రం దీనిని కరోనాతో కాకుండా విపక్షంతో పోరాటంగానే భావిస్తోంది. ఇది అబద్ధాలు వ్యాప్తి చేసే సమయం కాదు. ప్రభుత్వం నిజాలు మాత్రమే చెప్పాలి. మేము (విపక్షం) ప్రభుత్వ శత్రువులం కాదు. విపక్షాలు మార్గం చూపిస్తాయి. ఫిబ్రవరిలోనే మేము చెప్పిన మాట విని ఉంటే ఈ సంక్షోభంలో పడి ఉండే వాళ్లం కాదు” అని రాహుల్ అన్నారు.