తిరువనంతపురం: పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలు అమాంతంగా పెరగడానికి కాంగ్రెస్, భాజపా ప్రభుత్వాలే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు చమురు ధరలను విచ్చలవిడిగా పెంచుకునే అధికారం ఇచ్చిందని తప్పుబట్టారు. పెరుగుతన్న చమురు ధరలకు వ్యతిరేకంగా నాడు ఎద్దుల బండి నడిపి నిరసన వ్యక్తం చేసిన భాజపా నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదలకు వంత పాడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనాయకులు కొంతమంది భాజపా సాయంతో కేరళ అసెంబ్లీలో తిష్ట వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ వ్యాపారమే అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయన్నారు.