సాంకేతిక లోపాలు,విమానయాన సంస్థల సమస్యలతో ఇప్పటికే ఊపిరాడని పరిస్థితులతో సతమతమవుతున్న పైలట్లు శంషాబాద్ విమానాశ్రయం వెలుపలి వ్యక్తుల నుంచి కూడా కొత్త తరహా సమస్యలు ఎదురవుతున్నాయి.ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయంలో విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు ప్రధాన కారణం విమానాశ్రయం వెలుపలి నుంచి వెలువడుతున్న లేజర్ కిరణాలే.తాజాగా అటువంటి ఘటనే పైలట్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.విమానాశ్రయం రన్‌వే సమీపంలో రషీద్గూడకు చెందిన ఓ విద్యార్థి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు.ఈ సందర్భంగా ఆహ్వానితులను అలరించడానికి లేజర్‌షో ఏర్పాటు చేశాడు.అర్ధరాత్రి దాటే వరకు లేజర్‌షో కొనసాగించారు.అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌లో దిగడానికి వచ్చిన విమానాల పైలట్లు లేజర్‌షోతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.లేజర్ కిరణాలు విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ నుంచి వస్తున్నాయో లేక బయట నుంచి వస్తున్నాయో తెలియక తికమక పడ్డారు.విషయం తెలుసుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని లేజర్‌షో బంద్ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.విమానాశ్రయంలోని 23 అంతస్తుల ఏటీసీ టవర్ నుంచి లేజర్ దీపాలతో విమానాశ్రయంలో దిగడానికి పైలట్లకు సిగ్నల్స్ ఇస్తారు.ఏటీసీ టవర్ నుంచి వెలువడే లేజర్ కిరణాల ప్రకారం విమానాలు ల్యాండ్ అవుతుంటాయి.ఈ క్రమంలో విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో నిర్వహించిన లేజర్‌షో వల్ల పైలట్లు ఇబ్బందులు పడ్డారు. అయితే విమానాశ్రయం చుట్టుపక్కల నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన పెద్దపెద్ద ఫంక్షన్ హాళ్లు, ఇతర కట్టడాల్లో సైతం నిర్వహించే కార్యక్రమాల్లో లేజర్‌షోలు నిర్వహిస్తుండడంతో పైలట్లు తరచూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం ఉండడం లేదంటూ పైలట్లు వాపోతున్నారు..