ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సిబ్బంది కొరతతో మంత్రులు ప్రజాసమస్యలు తీర్చడానికి సతమతమవుతున్నారు.అన్ని జిల్లాల నుంచి ప్రతీరోజూ వందలామంది ప్రజలు సమస్య వినతులు, సిఫారసుల లేఖలు,శాఖపరమైన సమస్యలతో మంత్రుల వద్దకు వస్తుండగా పేషీల్లో సిబ్బంది, వ్యక్తిగత సహాయకులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రోజుల తరబడి సచివాలయం, మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజలు సైతం తీవ్ర అసహననాకి గురవుతున్నారు.ప్రజల సమస్యల వినతులను స్వీకరించాల్సిన ఓఎస్డీ, పీఎస్, పీఏలను ఇప్పటికీ నియమించకపోవడంతో ఇబ్బందులకు కారణంగా నిలుస్తోంది.మంత్రివర్గంలోని 25 మంది మంత్రులపైకి కేవలం పది మంది మంత్రులకు మాత్రమే సిబ్బందిని నియమించడంతో మిగిలిన 15 మంది మంత్రులు అన్ని రకాల వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తామే చర్యలు ఉపక్రమించాల్సి వస్తుండడంతో సమస్యల పరిష్కారం రోజుల తరబడి ఆలస్యమవుతోంది. మరోవైపు ఒకటికి మించి శాఖల బాధ్యతలు ఉన్న మంత్రుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా పరిణమించింది. ఒకటికన్న ఎక్కువ శాఖల బాధ్యతలు ఉన్న మంత్రులకు ఓఎస్డీతో పాటు ఒక పీఎస్, అడిషనల్ పీఎస్ అసరంకాగా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సిబ్బంది కొరత కారణంగా మంత్రే స్వయంగా సమస్యలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. మంత్రికి కీలక విషయాల్లో సాయం అందించే సిబ్బంది లేని కారణంగా పేషీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.ఇది పనుల్లో జాప్యానికి కారణమవుతోంది.కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బంది పనిచేస్తున్నా వారి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అందలేదు. దీంతో నెల రోజులు దాటినా జీతాలు అందక వారు జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పీఏలుగా పనిచేస్తున్న వారి విషయంలో ఈ సమస్య తలెత్తుతోంది. దీంతోపాటు వ్యక్తిగత సహాయకులకు,సిబ్బందికి సరైన వేతనాలు అందకపోవడంతో వారిలో అసంతృప్తికి దారి తీస్తోంది. సచివాలయానికి వస్తున్న జనం సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరగాల్సి రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పరిస్థితి ఇలాగే కొనసాగితే జనాల్లో అసంతృప్తి పెరిగి అది ఆందోళనలకు దారి తీస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి..