తొలి పారితోషకం రైల్వేకోడూరు నుంచే అందుకున్నా…

తొలి పారితోషకం రైల్వేకోడూరు నుంచే అందుకున్నా…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం రాయలసీమ జిల్లాల్లోని కడప జిల్లాలో కూడా పర్యటించారు.ఈ క్రమంలో కడప జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒకటైన రైల్వేకోడూరులో ప్రసంగించిన పవన్‌కళ్యాణ్‌ తన సినిమా కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు.ఈరోజు పవర్‌స్టార్‌గా మీ అందరి ఎదుట నిలుచున్నానంటే అందుకు కారణం రైల్వేకోడూరుకు చెందిన వ్యక్తేనని తెలపడంతో ప్రతీ ఒక్కరి షాక్‌కు గురయ్యారు.తన సినిమా కెరీర్‌ ప్రారంభంలో తనకు మొట్టమొదటి పారితోషకం ఇచ్చింది రైల్వేకోడూరుకు చెందిన వ్యక్తేనని ప్రకటించి ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి అనంతరం తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని నన్ను నమ్మి సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు.అటువంటి సమయంలో నామీద నమ్మకంతో తనతో సినిమా తీయడానికి వచ్చిన ఏకైక వ్యక్తి రైల్వేకోడూరుకు చెందిన నిర్మాత దాశరథి గారని చెప్పడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. తన పాత విషయాలను పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్న సమయంలో దాశరథి అక్కడే ఇంటి మేడపై నిల్చొని వింటున్నారు.ఈ సమయంలో దాశరథి ఇక్కడే ఉన్నారంటూ స్థానిక నేతలు చెప్పడంతో ఆశ్చర్యపడ్డ పవన్‌ వెంటనే ‘ఇక్కడే ఉన్నారా దగ్గరికి రండి’అంటూ వేదికపైకి పిలిపించుకొని కౌగిలించుకున్నారు.దాశరథి చేతిని పైకెత్తి చూపి నాకు మొదటి పారితోషకం ఇచ్చింది ఇదే దాశరథి గారంటూ ప్రజలకు తెలియజేశారు.సినిమా కెరీర్‌ ప్రారంభంలో నాకు తొలి పారితోషకం ఇచ్చిన రైల్వేకోడూరు నియోజకవర్గమే తనకు రాజకీయ ప్రస్థానం ప్రారంభంలో కూడా తొలి విజయాన్ని అందించాలంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos