రాజమండ్రి: వర్షం, పోలీసుల ఆంక్షల మధ్య ‘శ్రమదానం’ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం పూర్తి చేశారు. రాజమహేంద్రి విమానాశ్రయం నుంచి సభ ప్రాంగణం వరకూ అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. దీంతో పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఎలా అడ్డుకుంటారో చూద్దాం.. శ్రమదానం చేసి తీరుతాం. సభ నిర్వహించే ఇక్కడ్నుంచి కదులుతాం అని పోలీసులకు సవాల్ విసిరారు. పవన్ ప్రసంగాన్ని ప్రారంభించిన కొన్ని క్షణాలకే.. ‘సీఎం.. సీఎం.. సీఎం.. ’ అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీన్ని ఆయన ఆక్షేపించారు. ‘ ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవకండి. నేను చాలా అలసిపోయా. ఎందుకు అలసిపోయానో కూడా మీకు వివరంగా చెబుతా. సీఎం అనేది జరిగినప్పుడు అరవండి. అప్పటి వరకూ ఒక్క మాట కూడా సీఎం అని అరవకండి.. మీ నోటి నుంచి ఆ మాటే వినిపించకూడదు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. నేను సీఎం అవ్వాలని మీరు (కార్యకర్తలు, అభిమానులు) మనసులో దాచుకోండి.. అంతేకానీ ఇలా బయటికి చెప్పకండి.’అని కోరారు.