రాజమండ్రి: రాష్ట్రంలో రోడ్లు సక్రమంగా లేనందున గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం చేయాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం నగరాన్ని చేరుకున్నారు. పవన్కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నాయి. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ మూసివేశారు. సభకు ఇరు వైపులా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి వైపు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నారు. కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం లోనికి అనుమతించడం లేదు. ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. శ్రమదానానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పవన్ కళ్యాణ్ పాల్గొనే కార్యక్రమానికి అనుమతిలేదంటూ ఇక్కడి హుకుంపేట సభాస్థలం వద్ద కూడా జనసేన కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మీద శ్రమదానం చేస్తామని తొలుత జనసేన ప్రకటించింది.ఇందుకు సాగునీటి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో శ్రమదానాన్ని హకుంపేటకు మార్చారు. ”మా పార్టీ అధినేత రంగంలో దిగారు. సమస్య పరిష్కరించేవరకూ మా ఆందోళన సాగుతుంది. పవన్ సభను అడ్డుకోవాలని చూస్తే సహించం. అనుమతి లేదనే పేరుతో అడ్డంకులు సృష్టించకుండా సభ సజావుగా సాగేందుకు సహకరించాలి అని” జనసేన ప్రతినిధులన్నారు.